Kishan Reddy: ఏడాది పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలు : కిషన్ రెడ్డి
 
                                    ఏడాది పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) ఉత్సవాలు ఉత్సవాలు జరుపుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టి (Congress Party)కి నొప్పి అని, పీవీ నరసింహారావు (PV Narasimha Rao) అంటే కాంగ్రెస్‌కు నచ్చదంటూ వ్యాఖ్యలు చేశారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్‌కు నచ్చుతుందన్నారు. కాంగ్రెస్‌కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే దేశమని, నెహ్రూ తప్ప కాంగ్రెస్‌కు ఎవ్వరూ అవసరం లేదని విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ విరుచుకుపడ్డారు. పటేల్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ ది అంటూ ఆరోపించారు. పటేల్‌ను తెలంగాణ బిడ్డలు ఎవరూ మర్చిపోరని, సర్దార్ చేసిన త్యాగమే తెలంగాణ అని చెప్పుకొచ్చారు.
పటేల్ చొరవతోనే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగిరిందని కేంద్రమంత్రి తెలిపారు. నిజాం నిరంకుశత్వంపై ఉక్కు పాదం మోపిన ఘనుడు పటేల్ అని పేర్కొన్నారు. నిజాం మెడలు వంచి తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేశారన్నారు. ఈ ఏడాది అంతా పటేల్ 150 జయంతి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి పౌరుడు పటేల్ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. సర్దార్ స్పూర్తితో ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారని, వికసిత భారత్ లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.











 
                                                     
                                                        