Kishan Reddy: మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం.. బీసీలకే 42 శాతం ఇవ్వాలి: కిషన్ రెడ్డి
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తొలగిస్తే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలతో మాట్లాడతానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లతో ముస్లింలను ఎలా ముడిపెడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్ వంటివారు బీసీలు ఎలా అవుతారని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిందని, అయితే ఏ ఒక్క హామీని అమలు చేయలేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అథఃపాతాళానికి తొక్కేసిందని ఆయన (Kishan Reddy) విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ చెప్పినట్లే నడుచుకుంటున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తెలంగాణకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. బీసీలకు ఎల్లప్పుడూ బీజేపీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.







