Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో మేం ఎన్నడూ గెలవలేదు.. అయినా ప్రయత్నం చేశాం
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచిందని, దానికి మజ్లిస్ (Majlis) అండగా నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బిహార్ (Bihar) ఎన్నికల ఫలితాలపై ఆయన ఢల్లీిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ఒకరోజు ముందు రూ.కోట్లు దొరికాయని, దీనికి బాధ్యులెవరో అందరికీ తెలుసని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ ఫలితాన్ని తాము సమీక్షించకుంటామని, మరింత కష్టపడి పనిచేసి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని, బిహార్ ఎన్నికల ఫలితాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
హరియాణా, మహారాష్ట్ర తర్వాత బిహార్ ఎన్నికల ఫలితాలను చూస్తోంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుడ్‌బై చెప్పారని నిరూపితమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలూ చేజారిపోవడం ఖాయమని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో గతంలో మేం ఎన్నడూ గెలవలేదు. ఈ ప్రాంతంలో మాకు కార్పొరేటర్లూ లేరు. అయినా ప్రయత్నం చేశాం. సహజంగా ఉప ఎన్నికలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలత ఉంటుంది. ఇది రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పారు. బీఆర్ఎస్ సైతం ఓటర్లకు డబ్బులిచ్చింది. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ విషయం ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ, మండలిలో ఎన్నికల్లో రుజువైంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరిస్తామన్నారు.






