Kishan Reddy: దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని.. గవర్నర్ కోటాలో
 
                                    మైనార్టీ ఓట్ల కోసమే ఎమ్మెల్యే కాని అజారుద్దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిని చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి (Deepak Reddy) కి మద్దతుగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కాంగ్రెస్ మంత్రి వర్గాన్ని విస్తరించడంపై ప్రజలు ఆలోచించాలన్నారు. అజారుద్దీన్ (Azharuddin) దేశానికి సేవ చేశారా? అయితే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడిరచారు? ఆయనపై అనేక కేసులున్నాయి. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుంది. మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయి. ఒవైసీ సోదరులపై ఈగ వాలకుండా ఈ రెండు పార్టీలు కాపు కాస్తున్నాయి. మజ్లిస్ పార్టీ తమ గుర్తుపై ఎందుకు పోటీ చేయడం లేదో, ఎవరి సూట్‌కేసులకు అమ్ముడుపోయిందో చెప్పాలి. గతంలో మజ్లిస్‌తో కలిసి బీఆర్ఎస్ ఎలాంటి అరాచకాలు కొనసాగించిందో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే భారత రాష్ట్ర సమితిలో చేరతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే కాంగ్రెస్‌లో చేరతారు. బీజేపీ ఒక్కటే దేశ సంక్షేమం, గౌరవం కోసం పనిచేసే పార్టీ. జూబ్లీహిల్స్ ఎన్నికలో మంత్రులకు డివిజన్లు కేటాయించారు. వీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తూ ఇతర పార్టీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు సర్వేలు చేశామని చెబుతూ, తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్‌లో మాదిరే బీజేపీ జూబ్లీహిల్స్‌లోనూ గెలుస్తుందన్నారు.











 
                                                     
                                                        