Kavitha: ఎక్కడి సమస్యలు అక్కడే..ఇదేనా బంగారు తెలంగాణ : కవిత
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ (Congress) పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్లలో పూర్తి స్థాయిలో జిల్లాకు కృష్ణా జలాలు అందాయో లేదో ఆలోచించాలని అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్‌ను ఒక్క మాట అనరని, ప్రాజెక్టుల పరిశీలనలో తాము వెళ్తే నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. నల్గొండ జీజీహెచ్ మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవన్నారు. ఐసీయూలో ఒక్కో బెడ్‌కు ఇద్దరిని పడుకోబెడుతున్నారని తెలిపారు. ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ మందు లేకపోవడం బాధాకరమని అన్నారు.
ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రశ్నించారు. భూదాన్ భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేదని నిలదీశారు. నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ ఏపీ చేతిలో ఉందని, లెఫ్ట్ బ్యాంక్ పూర్తిగా సెంట్రల్ చేతులో పెట్టారన్నారు. సామాజిక తెలంగాణ రావాల్సి ఉందని, అందుకోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులు పెడుతోన్న నిబంధనలను సడలించాలన్నారు.







