భద్రాద్రి రామాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం

ఉగాది నుంచి ఈ నెల 23 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కొనసాగే శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి పంచి మూలవిరాట్ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. విష్వక్సేనపూజ, రక్షాబంధనం, వాస్తు హోమం కొనసాగించారు. గోదావరి నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి వేద మంత్రోచ్చారణ మధ్య అభిషేకం చేశారు. ఉత్సవాల అంకురార్పణ సందర్భంగా పుట్టమట్టిని పూజించారు. పంచాంగ పఠనంలో సీతారాముల వారి ఆదాయ వ్యయాల గురించి ప్రవచించారు. తిరువీధి సేవలో సీతారాములవారు స్వర్ణ కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవనాథ రామానుజ జీయర్‌స్వామి రాములవారిని దర్శించుకున్నారు. ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.