Kavitha: నేను మొదటి బాధితురాలిని..ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది: కవిత
కక్ష సాధింపు రాజకీయాలకు మొదటి బాధితురాలిని నేను. ఇప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలకు కేటీఆర్ బలవుతున్నారు. అయినా చట్టం, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పీఏ నగర్లో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ అనుమతించిన విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స మాధానంగా ఆమె స్పందించారు. బీజేపీ వాళ్లకు వాళ్లమీద వీళ్లమీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని, కాంగ్రెస్ (Congress) వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని విమర్శించారు. ఆ 2 పార్టీలు ప్రజలకు మొఖం చూపలేక ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిస్థితి పైన పటారం, లోన లోటారం అన్నట్లు ఉందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం నిద్ర పోతోందని, పాలకపక్షం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరువును తీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు.






