Kavitha:పార్టీ పెడితే.. వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా : కవిత
గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వంటి సీనియర్ నేతను వదులుకొని కేసీఆర్ తప్పు చేశారని, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం వల్లే బీఆర్ఎస్ (BRS) ఓటమి పాలైందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా రెండో రెజు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ వంటి రాజకీయ అనుభవజ్ఞులే తప్పులు చేశారని, క్షేత్రస్థాయిలో తాను అలాంటివి చేయకూడదన్న లక్ష్యంతోనే ప్రజల్లోకి వెళ్తున్నానన్నారు. హడావుడిగా పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, తొలుత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం సాగిస్తానని వెల్లడించారు. పార్టీ పెట్టాలనుకుంటే ప్రజల కోసం వజ్రాయుధం లాంటి పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు. కాంగ్రె్సపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలిచిందని, ఇది ప్రతిపక్షాల వైఫల్యమేనని అన్నారు. జాగృతి జనం బాట ప్రారంభించిన తర్వాత తనపై నీచ స్థాయిలో దాడి చేస్తున్నారని, అయినా బెదిరేది లేదన్నారు.






