Harish Rao: హరీశ్ రావును సాగనంపేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ స్కెచ్..?

కేసీఆర్ కుటుంబంలో (KCR Family) విభేదాలు కుమార్తెను పార్టీ నుంచి బయటకు పంపించేంత వరకూ వెళ్లాయి. కుమార్తె కవిత (Kavitha) కూడా పార్టీ వద్దనుకున్నప్పుడు నాకు కూడా పార్టీ అవసరం లేదంటూ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ (MLC) పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే పార్టీలో హరీశ్ రావు (Harish Rao), సంతోశ్ రావుల (Santosh Rao) వల్ల కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) కు ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని కవిత హెచ్చరించారు. అయితే కవిత హెచ్చరికలపై విశ్లేషకులు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హరీశ్ రావును పార్టీ నుంచి సాగనంపేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ డ్రామా ఆడుతూ ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు.
హరీశ్ రావు బీఆర్ఎస్ (BRS) పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తన మామ కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. అయితే హరీశ్ రావు పార్టీ ఆవిర్భావం నుంచి లేరని, ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారని తాజాగా కవిత వెల్లడించారు. ఏదేమైనా పార్టీలో హరీశ్ రావు పాత్ర ఎవరూ కాదనలేనిది. ఆయన్ను పార్టీలో అందరూ ట్రబుల్ షూటర్ గా భావిస్తుంటారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని చక్కబెట్టే బాధ్యతలను పలుమార్లు హరీశ్ రావుకు అప్పగించారు కేసీఆర్. హరీశ్ రావు కూడా తనకు అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా పాటిస్తూ వచ్చారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ కు పార్టీలో ఎంత పట్టుందో హరీశ్ రావుకు కూడా అంతే పట్టు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే కొంతకాలంగా పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు అనేదానిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనుచరులంతా ఇందులో సందేహం ఎందుకు.. కేటీఆర్ మాత్రమేనని ఢంకా బజాయించి చెప్తున్నారు. అయితే హరీశ్ రావుకు కూడా పార్టీలో కేడర్ ఉంది. తనను అభిమానించే వాళ్లు కూడా ఉన్నారు. ఒకవేళ హరీశ్ రావు బయటికెళ్తే పార్టీ చీలిపోతుందేమోనని అనుమానించే వాళ్లున్నారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్లిన సమయంలో హరీశ్ రావు కూడా వెళ్తారేమోనని వార్తలు వచ్చాయి. కానీ హరీశ్ రావు మాత్రం తనకు అలాంటి ఉద్దేశం లేదని, తుది శ్వాస వరకూ కేసీఆర్ వెంటే నడుస్తానని, ఆయన తన నాయకుడని ప్రకటించారు. అప్పటి నుంచి హరీశ్ రావును కేసీఆర్ మళ్లీ దగ్గర చేర్చుకున్నారు. దీంతో సమస్య ముగిసిందని భావించారు.
అయితే హరీశ్ రావుతో ఎప్పటికైనా పార్టీకి ముప్పు పొంచి ఉంటుందనే అనుమానాలు చాలాకాలంగా ఉంటున్నాయి. అందుకే ఆయన్ను వదిలించుకునేందుకు కవిత ద్వారా కల్వకుంట్ల ఫ్యామిలీ స్కెచ్ వేసిందని తాజాగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హరీశ్ రావుకు రాజకీయ జీవితం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్, కేటీఆర్ లపై కాకుండా హరీశ్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేసినట్లు అనుమానిస్తున్నారు. హరీశ్ రావుపైన కవిత అవినీతి ముద్ర వేసింది. అంతేకాక కేటీఆర్, కేసీఆర్ లకు హరీశ్ రావు నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ సమయంలో హరీశ్ రావు తనంతట తానుగా పార్టీని వీడితే.. తాను ముందే చెప్పానని కవిత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ హరీశ్ రావు బయటకు వెళ్లకుండా ఇలాగే ఉంటే అవినీతి ఆరోపణలతో పార్టీ నుంచి బయటకు పంపొచ్చు. అప్పుడు పార్టీకి పెద్ద నష్టం ఉండదు. కేటీఆర్ మాత్రమే ఏకైక వారసుడిగా ఉండిపోతారు. అందుకే కవిత ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ డ్రామా ఆడుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.