Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ దారిలోనే : కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి దూరమయ్యారని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బోరబండ డివిజన్ (Borabanda Division) లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మంచి మార్పు రావాలంటే, హైదరాబాద్‌ను రక్షించుకోవాలంటే బీజేపీ (BJP)ని గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవని, పారిశుద్ధ్యం లోపించిందని, వీధి దీపాలు కూడా వెలగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్లు గూండాయిజం చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టి వేధించడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. సుదీర్ఘకాలం అధికారంలో, పదవుల్లో ఉంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కార్పొరేటర్లే జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి దూరం కావడానికి కారణమన్నారు. హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కూడా కేసీఆర్ (KCR) దారిలోనే నడుస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.






