Mahesh Goud: సీఎం రేవంత్, నాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు
సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య గ్యాప్ లేదని, సమన్వయంతో కలిసి పని చేసుకుంటున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ (Mahesh Gowda) చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గం లో చేరాలని తానేమీ ఆరాట పడట్లేదని, రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మంత్రులు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌గా చాలా సంతోషంగా ఉన్నానని, మంత్రి పదవి కావాలని తానెప్పుడూ అడగలేదని వెల్లడించారు. క్యాబినెట్ (Cabinet) విస్తరణ సంగతి పార్టీ అధిష్ఠానం, సీఎం చూసుకుంటారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మరో సారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత బాగా పెరిగిందని, మరో పదేళ్లు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి అధిష్ఠానం కసరత్తు పూర్తయిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడవచ్చని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నవీన్యాదవ్ను అభ్యర్థిగా నిలబెట్టడం తమకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు.







