Sreeja Verma: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా (Siddipet District) రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా వర్మ, శ్రేయా వర్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ వర్మ దంపతులు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె శ్రీజా వర్మ (Sreeja Verma) ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లింది. ఈ మధ్యే ఎంఎస్ పూర్తి చేసింది. అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి భోజనం చేసేందుకు కారులో రెస్టరంట్‌కు వెళ్లింది. భోజనం చేసి తిరిగి వస్తుండగా ఆమె వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ తీవ్రంగా గాయపడి మృతి చెందింది.ప్రమాదం జరిగిన సమయంలో కారులో శ్రీజా వర్మతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ వర్మ చిన్న కుమార్తె శ్రేయా వర్మ సైతం ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికా వెళ్లింది.







