Revanth Reddy:ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చెప్పారు.ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ (Hyderabad) స్వర్గధామం అన్నారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఢోకా లేదని తెలిపారు. దేశంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో యువశక్తి ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో గత 35 ఏళ్లుగా కాంగ్రె్‌సతోపాటు అనేక పార్టీల ప్రభుత్వాలు సారథ్యం వహించినా, పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు మద్దతుగా నిలిచాయని వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని తెలిపారు. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితోపాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 30 వేల ఎకరాల్లో అద్భుతమైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) ని నిర్మిస్తున్నామని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు – రీజినల్ రింగ్ రోడ్డు మధ్య తయారీ జోన్ వంటి కీలక మౌలిక ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు. చైనా ప్లస్ 1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని చెప్పారు.






