హెచ్ఎండిఎ వేలంతో మళ్ళీ రియల్ బూమ్

హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం?ఏర్పడ్డాక రియల్ బూమ్ కనిపించడం ఇదే మొదటిసారి. హెచ్‌ఎండిఎ అప్రూవ్డ్ లేఅవుట్లు వేసిన ప్లాట్లను తానే సొంతంగా ఆన్‌లైన్‌లో విక్రయించింది. ఎవరూ ఊహించని విధంగా ధరలు రావడంతో అధికారులు, రియల్టీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఈ ధరలు హైదరాబాద్‌లో రియల్ బూమ్‌ను మరోస్థాయికి తీసుకువెళ్తాయని రియల్టర్లు అంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో గజం ధర సాధారణంగా లక్ష రూపాయలు లేదా మరో ఐదు, పది వేల రూపాయలు ఎక్కువగా ఉంటుంది. కానీ హెచ్‌ఎండిఎ ఆన్‌లైన్ వేలంలో మాదాపూర్‌లో గజం ధర 1.52 లక్షల రూపాయలు, అత్తాపూర్‌లో 1.53 లక్షల రూపాయలు పలకడం భూములకున్న డిమాండ్‌ను తెలియజేస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లోనేకాకుండా శివారు ప్రాంతాలైన బాచుపల్లిలో గజం ధర 35 వేల రూపాయలు, మియాపూర్‌లో 62 వేల రూపాయలు పలికాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం అమ్ముడవుతున్న గజం ధరకన్నా అధికంగా పలకడంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖ చిత్రం మారిపోయిందని పరిశీలకులు అంటున్నారు.
హైదరాబాద్‌లో భూములు ఎంతో విలువైనవి. ఇక్కడ ఐటి తదితర రంగాల్లో పని చేస్తున్న చాలా మంది భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి భూముల్లో వివాదాలకు కూడా అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న భూములను కొనుగోలు చేయడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారమే. ఇలాంటి తరుణంలో భూవివాదాలు లేకుండా క్లియర్ టైటిల్‌డీడ్ ఉండటం, బ్యాంకుల నుంచి రుణాలైనా, నిర్మాణాలకు అనుమతులైనా సులువుగా, వేగంగా వచ్చే అవకాశం ఉండటంతో హెచ్‌ఎండిఎ ప్లాట్లకు బాగా డిమాండ్ ఏర్పడింది.
దాదాపు దశాబ్దం క్రితం హైదరాబాద్ మహానగరం చుట్టు పక్కల భూములకు విపరీతమైన డిమాండ్ రావడంతో అప్పట్లో రియల్ బూమ్ తారా స్థాయికి చేరింది. అదే స్థాయిలో రియల్ బూమ్ పడిపోయింది. శివారు ప్రాంతంలోని మహేశ్వరంలో రియల్ బూమ్ సమయంలో ఎకరా ధర కోటి రూపాయలు పలకగా, ఆ తర్వాత ఆ ధర 30-40 లక్షల రూపాయలకు పడిపోయింది. అలా పడిపోయిన ధరలు ప్రత్యేక ఉద్యమ నేపథ్యంతో ఐదారేళ్లపాటు స్థిరంగానే ఉండిపోయాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో క్రమంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంది. అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి చేపట్టిన సర్వేల్లో వృద్ధి రేటు బాగుపడుతూ ఉండడం, ఆఫీసు స్థలాలు, నివాస ప్రాంతాలకు డిమాండు పెరుగుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ధరలు చాలా అందుబాటులోనే ఉంటున్నాయి.