Ramalingeswara Swamy : వైభవంగా చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి కల్యాణం

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు(Chervugattu) గ్రామంలో కొండపైన ఉన్న జడల రామలింగేశ్వర స్వామి (Ramalingeswara Swamy) అమ్మవార్ల కల్యాణ మహోత్సవం బుధవారం తెల్లవారుజామున కనులపండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, సన్నాయి వాయిద్యాల నడుమ వరుడు పరమేశ్వరుడు నంది వాహనంపై, వధువు పార్వతీ దేవీ పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి భక్తజనం మధ్య కల్యాణ మండపానికి చేరుకున్నారు. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. యాజ్జీకులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని ఆచార్యత్వంలో, ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ (Ramalingeswara Sharma) ఆధ్వర్యంలో వేద పండితులు మధ్య స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.