Davos: రూ.1,78,950 కోట్ల పెట్టుబడుల రాక.. రేవంత్ బృందం దావోస్ పర్యటన విజయవంతం

తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ.. ముఖ్యంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను రేవంత్ బృందం సాధించింది. అన్ని రంగాలకు అనుకూల వాతావరణమున్న హైదరాబాద్ మహా నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెబుతూ పెట్టుబడులకు చేసుకున్న ఒప్పందంతో నిరూపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్(Davos) పర్యటన ఈసారి విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, జెఎస్‌డబ్ల్యు, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్‌లలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకోసం అనుసరిస్తున్న విధానాలను, మరోవైపు, చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సీఎం అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి‘ అని సీఎం స్వాగతం పలికారు.
16 సంస్థల నుంచి పెట్టుబడుల వివరాలు ఇలా..
సన్ పెట్రో కెమికల్స్: ఈ సంస్థ భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు రానున్నాయి. 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్.. 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా.. 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది.
a కంట్రోల్ ఎస్: ఈ సంస్థ తెలంగాణలో అత్యాధునిక %AI% డేటాసెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుండగా.. అందుకు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా 3,600 మందికి ఉపాధి లభించనుంది.
జేఎస్‌డబ్ల్యూ: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఇది రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా మారనుంది. అందుకు రూ.800 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 200 ఉద్యోగాలు రానున్నాయి.
స్కైరూట్ ఏరో స్పేస్: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దాని కోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
మేఘా ఇంజినీరింగ్: మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది. అందుకు రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫలితంగా 5,250 మందికి ఉపాధి దొరకనుంది.
హెచ్‌సీఎల్ టెక్ సెంటర్: హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది.
విప్రో: హైదరాబాద్‌లో విప్రో కంపెనీ తన సేవలను విస్తరించబోతున్నది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా.. దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి.
ఇన్ఫోసిస్: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సైతం విస్తరిస్తున్నారు. పోచారంలోని ఐటీ క్యాంపస్‌లో కొత్త సెంటర్ ఓపెన్ కోసం ఆ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. ఫలితంగా 17,000 ఉద్యోగాలు రాబోతున్నాయి.
యూనీ లివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. అదే విధంగా రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. వీటిలో దాదాపు 1,000 ఉద్యోగాలు రాబోతున్నాయి.
టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్: హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతోంది. అందుకోసం ఈ సంస్థ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
ఉర్సా క్లస్టర్స్: అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. అందుకు రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
బ్లాక్‌స్టోన్: ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ): అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనుండగా.. ఇందుకు రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది.
ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్: ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయం ఉండేలా హైదరాబాద్‌లో కొత్త ఆఫీసు ఏర్పాటు చేయనున్నది.
సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్: సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటును చేయబోతున్నట్లు తెలుస్తున్నది.
పత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్
దావోస్‌లోని ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియా గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్‌లను కేటాయించారు. ‘తెలంగాణ అంటే వ్యాపారం తెలంగాణ మీన్స్ బిజినెస్’ ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, నిపుణులను ఆకట్టుకుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతోపాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, ఇక్కడి అనుకూలతలను చాటిచెప్పేలా అందంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రదర్శించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణలను కళ్లకు కట్టేలా బ్యాక్ గ్రౌండ్ వాల్ పోస్టర్లను అమర్చారు. దేశంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్, ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణ, దేశ విదేశీ ప్రయాణికులకు అనువైన అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు.. కొత్తగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డుతో మెరుగైన రవాణా సదుపాయాలను ఇందులో నైపుణ్యాలకు కొదవ లేదంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ‘స్కిల్స్ డెవలప్‌మెంట్’కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలోనే మొట్ట మొదటగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలను ఈ జాబితాలో ప్రస్తావించారు.
తెలంగాణలో పెట్టుబడులకు ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలను ఇందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల విధానంతోపాటు, ఎలక్ట్రిక్ వెహికల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇంధన రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు సులభమైన సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఈ పెవిలియన్‌లో పొందుపర్చారు.
దేశంలోనే ఉన్నత జీవన ప్రమాణాలు అందుబాటులో ఉన్న అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్. చారిత్రకంగా, సాంస్కృతికంగా, వారసత్వంగా దీనికి ఉన్న ప్రాధాన్యతలు, ఇక్కడి కళా సంపదను ప్రచారం చేయటంతో పాటు.. గ్రేటర్ సిటీ అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న భవిష్యత్ లక్ష్యాలను విశ్లేషించారు. భద్రతతోపాటు తక్కువ జీవన వ్యయం ఉన్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. నగరం ఏర్పడినప్పటి నుంచి ఎదిగిన తీరును పేర్కొంటూ.. చార్మినార్‌తోపాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ.. అధునాతన ఫ్యూచర్ సిటీ నమూనాను తలపించే వాల్ పోస్టర్.. తదితరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీ 14 వేల ఎకరాల్లో విస్తరిస్తుందని, ఇందులో 6 వేల ఎకరాల్లో అటవీ పరిరక్షణ ఎకో జోన్ ఉంటుందని, ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని ఈ వేదిక ద్వారా చాటిచెప్పారు. ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ టూరిజం, ఎకో-టూరిజం వంటి ప్రత్యేక జోన్లతో ‘వర్క్, లివ్, లెర్న్, ప్లే’ కాన్సెప్ట్‌పై ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు ఈ వేదిక ద్వారా ప్రపంచ పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు.
ప్రపంచంతోనే మాకు పోటీ: రేవంత్ రెడ్డి
సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో జరిగిన ‘‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ మేరకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వేదికను పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము సరిహద్దులతో పాటు నదులు, కృష్ణా, గోదావరి నీటిని కూడా పంచుకుంటున్నాం. ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయి. అందువల్ల, మేం అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత’’ అని రేవంత్ రెడ్డి వివరించారు. న్యూయార్క్, టోక్యో లాంటి నగరాల స్థాయికి హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతుంది. అభివృద్ధి బాటలో నడవడానికి తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగిస్తుందన్నారు. ఇప్పుడు, తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతోంది. దేశీయ రాష్ట్రాలతో పోటీ పడటం కాకుండా చైనా ప్లస్ వన్ కంట్రీకి తెలంగాణ గమ్యస్థానంగా ఉంటుంది. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని చెప్పారు.