Bhatti Vikramarka: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (APHME) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. గురువారం ఆయన సింగరేణి సీఎండీ బలరామ్‌తో కలిసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈని సందర్శించారు. ఏపీహెచ్ఎంఈ సంస్థకు ఉన్నంతటి మిషనరీ, మానవ వనరులు ప్రపంచంలో మరే ఇతర ఇంజినీరింగ్ సంస్థలకు లేవని అన్నారు. అధికారులు, కార్మికులు నిబద్ధతతో పనిచేస్తే ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని ఆయన (Bhatti Vikramarka) సూచించారు. సంస్థ అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక కోసం త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని ఆయన తెలిపారు. ఆ కన్సల్టెన్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో సంస్థను ఎలా అభివృద్ధి చేయాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. కేవలం సింగరేణి కాలరీస్‌కే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన యంత్రాల తయారీ, మరమ్మతు ఆర్డర్లను కూడా స్వీకరించాలని ఏపీహెచ్ఎంఈ అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. ఉద్యోగుల శ్రమ, ఉన్నత ఆలోచనలతో ఈ పరిశ్రమ మరింత ముందుకు సాగుతుందని ఆయన (Bhatti Vikramarka) ఆశాభావం వ్యక్తం చేశారు.







