Etela Vs Bandi: ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.. టార్గెట్ బండి సంజయ్..?

తెలంగాణ బీజేపీలో (Telangana BJP) అంతర్గత కలహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajendar) తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను (Bandi Sanjay) ఉద్దేశించినవనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య గత కొంత కాలంగా ఉన్న రాజకీయ ఘర్షణ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ వివాదం మరింత ముదిరి, పార్టీలో ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈటల రాజేందర్ తాజా వ్యాఖ్యలు బీజేపీలోని అంతర్గత రాజకీయ డైనమిక్స్ ను బహిర్గతం చేశాయి. “వాడు సైకోనా.. శాడిస్ట్‌నా.. వాడి పార్టీ ఏంది? మొత్తం పైకి పంపిస్తా. నీ చరిత్ర ఏంది, నా చరిత్ర ఏంది? నా చరిత్ర తెలవదు కొడకా!” అంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. “2019లో మోడీ ప్రభంజనం, హిందూ బొందు గాలి అన్నప్పుడు కూడా టీఆర్ఎస్‌కు 53 వేల మెజారిటీ వచ్చింది. నీకు మెజారిటీ రాలేదు” అని ఈటల గుర్తు చేశారు. బండి సంజయ్ రాజకీయ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ, ఈటల తన రాజకీయ చరిత్రను గుర్తు చేసేలా ఈ కామెంట్స్ ఉన్నాయి.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఈటల రాజేందర్‌తో రాజకీయంగా ఘర్షణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత హుజూరాబాద్‌లో (Huzurabad) బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే, బండి సంజయ్ నాయకత్వంలో పార్టీలో ఆయన వర్గానికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి ఈటల వర్గంలో నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఈటల ఓడిపోయారు. తర్వాత మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. దీంతో హుజూరాబాద్ పై ఈటల దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో కరీంనగర్ (Karimnagar) ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ హూజూరాబాద్ పై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల వర్గానికి టికెట్లు ఇవ్వబోమని బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఈటల, “రేపు నా మనుషులే సర్పంచ్‌గా, వార్డ్ మెంబర్‌గా ఉంటారు” అని కౌంటర్ ఇచ్చారు.
ఈటల అనుచరుడు, హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనం. ఈటల వర్గాన్ని బండి సంజయ్ వర్గం అవమానిస్తోందని, అణిచివేస్తోందని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. తాజాగా హుజూరాబాద్ కు చెందిన బీజేపీ నేతలు, శామీర్ పేటలోని ఈటల రాజేందర్ ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ని టార్గెట్ గా చేసుకుని పదునైన విమర్శలు గుప్పించారు.
తెలంగాణ బీజేపీలో వర్గ పోరు కొత్తేమీ కాదు. గతంలోనూ ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, ఈటల 2024లో ఈ విషయాన్ని ఖండించారు. “బండి సంజయ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, తాజా వ్యాఖ్యలు ఈ ఖండనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బీజేపీ అధిష్ఠానం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.