Etela Rajender: సొంత పార్టీ పెట్టబోతున్న ఈటల రాజేందర్..?

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో (Bandi Sanjay) ఇటీవల జరిగిన వివాదం, ఈటల ఘాటు వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు గురించి గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం బీజేపీలో ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సొంత పార్టీ పెట్టడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి ఎంపీగా, బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పటికీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే ఆవేదనలో ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో జరిగిన ఇటీవలి సమావేశంలో ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ను ఉద్దేశించి, “నీతిగల వారితో ధైర్యంగా పోరాడతాను, కానీ కుట్రగాళ్లతో కాదు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి నాకు లేదు” అని ఘాటుగా విమర్శించారు. “బీ కేర్‌ఫుల్ కొడుకా” అంటూ బండి సంజయ్‌కు హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ వివాదం హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలకు టికెట్ల కేటాయింపు విషయంలో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈటల డిమాండ్ చేస్తున్నారు. అయితే, బండి సంజయ్ మాత్రం, “బీజేపీలో వర్గాలు లేవు, మోదీ గ్రూప్ మాత్రమే ఉంది. కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు వస్తాయి” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఈటల అనుచరులకు కోపం తెప్పించాయి. లోక్‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో తనకు తక్కువ ఓట్లు రావడానికి ఈటల వర్గం కారణమని బండి సంజయ్ ఆరోపించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది.
ఈటల రాజేందర్ సొంత పార్టీ పెట్టే ఊహాగానాలు కొత్తవి కావు. 2021లో బీఆర్ఎస్ నుంచి భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగించినప్పుడు, సొంత పార్టీ స్థాపిస్తారని వార్తలు వచ్చాయి. అప్పట్లో హరీశ్ రావుతో కలిసి ఈటల కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చర్చ జరిగింది. అయితే, ఈటల బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీలో అసంతృప్తితో సొంత పార్టీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనకు బీజేపీలో తగిన గుర్తింపు లభించడం లేదని, పార్టీ నాయకత్వం ఆయన సేవలను పట్టించుకోవట్లేదని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు.
ఈటల రాజేందర్ రాజకీయ జీవితం ఎన్నో ఒడిదొడుకులతో నడిచింది. బీఆర్ఎస్‌లో మంత్రిగా, బీజేపీలో ఎంపీగా ఆయన సేవలందించారు. అయితే, బీజేపీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, బండి సంజయ్‌తో విభేదాలు ఆయనను కొత్త నిర్ణయం తీసుకునే దిశగా నడిపిస్తున్నాయి. సొంత పార్టీ స్థాపన ద్వారా ఈటల తన రాజకీయ బలాన్ని నిరూపించుకోగలరా? లేక బీజేపీలోనే కొనసాగుతారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.