New Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్రియకు బ్రేకులు వేసిన ఈసీ

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) ఇచ్చే కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రకటనపై.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల, రేషన్ కార్డుల (New Ration Cards) దరఖాస్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ రేషన్ కార్డుల అంశంపై శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోని వారు ‘మీ సేవ’ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు తమ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలన్నా మీసేవ కేంద్రాల్లో చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల్లోనే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ ప్రక్రియకు బ్రేకులు వేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించడం గమనార్హం.