Hyderabad: లోకేష్, కేటీఆర్ భేటీ అయ్యారా..? రేవంత్ వ్యాఖ్యల్లో నిజమెంత..?

ప్రసుత్తం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం విచిత్ర మలుపులు తిరుగుతోంది. ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్నారు. తెలంగాణకు సీఎంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు మంచి సన్నిహితులనడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సాక్షాత్తూ రేవంత్ రెడ్డి(Revanth reddy).. స్వయంగా రాజకీయాల్లో తనను చంద్రబాబు ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. దీనికి తోడు గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా ఉండడం వెనక కూడా వీరిద్దరి మధ్య మితృత్వం ఓ కారణంగా చెబుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య పాలనా పరమైన విభేదాలు పెరుగుతున్నాయి.
ఏపీలో పవర్ చేపట్టిన కూటమి సర్కార్… ముఖ్యంగా అతిపెద్ద పార్టీ టీడీపీ.. తెలంగాణలో బలోపేతంపై కన్నేసిందని చెప్పవచ్చు. అందుకు అనువైన వాతావరణం కోసం చంద్రబాబు సైతం ఎదురుచూస్తున్న పరిస్థితులున్నాయి. అయితే అదే టీడీపీ నుంచి నేతలను ఆకర్షించి.. టీఆర్ఎస్ బలంగా ఎదిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ గా వ్యవహరిస్తున్న ఈపార్టీ.. ఎప్పుడు టీడీపీని శత్రువుగానే చూసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపార్టీ నేతలే ఇక్కడా అధికారం వెలగబెట్టారు. అంతేకాదు..ఏడాది క్రితం చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఆపార్టీని గట్టిగా దెబ్బకొట్టాయని చెప్పవచ్చు.
ఇప్పుడు లోకల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈసమయంలో బీఆర్ఎస్ కు హైదరాబాదీల అండ అవసరంగా ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిలైన సీమాంధ్రుల ఓట్లపై గులాబీ పార్టీ కన్నేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈతరుణంలో లోకేష్ తో కేటీఆర్ భేటీ అయ్యారంటూ సీఎం రేవంత్ రెడ్డి బాంబేశారు. అంతే ఈ వ్యవహారం ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. తాను లోకేష్ ను కలవలేదంటూనే.. కలిస్తే తప్పేముందని నేరుగా ప్రశ్నించారు కేటీఆర్.
వీరిద్దరూ కలిశారన్న వార్త ఓవిధంగా బీఆర్ఎస్ కు, టీడీపీకి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిణామమే. అదే సమయంలో బీఆర్ఎస్ కున్న ఓటర్లు.. ఇప్పుడు వెనక్కు చూసుకునే పరిస్థితి తెచ్చారు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు తాము ఆంధ్ర పార్టీలను వ్యతిరేకిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు వారి పక్షాన చేరి, రాజకీయాలు చేస్తున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఈసారి ఉద్యమ సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఇక బీఆర్ఎస్ కు ఉండదు. దీంతో హస్తం గెలుపు నల్లేరుపై నడకేనన్న అంచనాలు రేవంత్ కు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.