ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2021

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఇటీవలికాలంలో మళ్ళీ జోరందుకోవడంతో కొనుగోలుదారులకు కొత్త ప్రాజెక్టులు, వెంచర్లపై అవగాహన కల్పించేందుకు క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినట్లు క్రెడాయ్ అధ్యక్షుడు పి. రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు క్రెడాయ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2021ను హైటెక్స్ వేదికగా ఏర్పాటు చేశామని, కోవిడ్-19 మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాపర్టీ షోలో దాదాపు 74 స్టాల్స్ ఏర్పాటవుతున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇందులో పాల్గొని తమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అలాగే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి డెవలపర్లు, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఇలా అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చేలా ఈ ప్రదర్శన ఉంటుందని, ఇది కొనుగోలుదారులకు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో టిఎస్‌ఐపాస్ కారణంగా ఐటీ, ఐటీయేతర కంపెనీల రాకతో రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ పెరిగిందని, దాదాపు 40శాతంపైగా రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చాయని అంటూ, మరో 5 నుంచి పదేళ్ళలో రియల్ ఎస్టేట్‌రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెబుతూ, ఈ నేపథ్యంలో తాము ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాపర్టీ షో అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అన్ని వర్గాల వారి బడ్జెట్‌లకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో ఇండ్ల ధరలు పెరగకముందే తమ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు ఇదే మంచి తరుణమని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్‌లు సి. మురళీ మోహన్, కె. రాజేశ్వర్, ఎన్ జయ్‌దీప్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాంబాబుతోపాటు ఇతరులు ఈ సందర్భంగా మాట్లాడారు.