Maganti Sunitha: ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది : మాగంటి సునీత
జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఆరోపించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపొందారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదని, నైతికంగా తానే గెలిచానని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, 24, 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతయింది.






