Panchayat Elections: పల్లె పోరులోనూ కాంగ్రెస్ ప్రభంజనం!
ఎన్నో వాయిదాలు, న్యాయపరమైన చిక్కులు, రాజకీయ ఉత్కంఠల నడుమ ఎట్టకేలకు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇవి రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం మన రాజకీయాల్లో ఆనవాయితీ. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రుజువైంది. పల్లె పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకపక్ష విజయాలను నమోదు చేసుకుంటూ, హస్తం పార్టీకి తిరుగులేదని నిరూపించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్ల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా ఆ ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా విజయం సాధించారు. ప్రభుత్వ పథకాల అమలు, అధికార యంత్రాంగం సహకారం, స్థానిక ఎమ్మెల్యేల పట్టు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఈ విజయాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమన్వయం చేసుకోవడం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS)కి ఈ ఎన్నికలు మరో సవాలుగా మారాయి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో నిలిచినప్పటికీ, గతంలో ఆ పార్టీకి ఉన్న గ్రామీణ పట్టు సడలిందనేది స్పష్టమైంది. అనేక చోట్ల బీఆర్ఎస్ క్యాడర్ అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం గులాబీ పార్టీని కలవరపెడుతోంది.
మరోవైపు, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ (BJP)కి పంచాయతీ ఫలితాలు మింగుడుపడడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత బలం గ్రామీణ స్థాయిలో లేకపోవడం, బూత్ స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం లోపించడం బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణాలు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండిపోయింది. గ్రామీణ తెలంగాణలో తాము ఇంకా బలపడాల్సిన అవసరం ఉందని ఈ ఫలితాలు కమలం పార్టీకి గుర్తు చేశాయి.
ఈ ఎన్నికల ఫలితాలు ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు నిదర్శనం అని చెప్పొచ్చు. వరుస ఎన్నికల్లో అంటే.. అసెంబ్లీ, పార్లమెంట్, ఇప్పుడు పంచాయతీల్లో విజయాలు సాధించడం ద్వారా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. పార్టీలోని అసమ్మతి స్వరాలకు చెక్ పెట్టడానికి, అధిష్టానం వద్ద తన గ్రాఫ్ పెంచుకోవడానికి ఈ ఫలితాలు ఆయనకు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడతాయి. పరిపాలనపై పట్టు సాధిస్తూనే, రాజకీయంగా పార్టీని గెలుపు బాటలో నడిపించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారని చెప్పవచ్చు.
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఈ భారీ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి ఆత్మవిశ్వాసం లభించింది. గ్రామీణ ఓటర్ల నాడిని పట్టుకున్న కాంగ్రెస్, అదే ఊపుతో పట్టణ ఓటర్లను కూడా ఆకట్టుకోగలిగితే, తెలంగాణలో రాబోయే ఐదేళ్ల పాటు ఆ పార్టీదే ఆధిపత్యం అనడంలో సందేహం లేదు. మొత్తానికి, పంచాయతీ పోరు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నిపూర్తిగా మార్చేసిందన్నది విశ్లేషకుల మాట.






