Osmania Hospital :నయా ఉస్మానియా కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) కొత్త భవనం కల సాకారం కాబోతోంది. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియం (Goshamahal Police Stadium )లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) మీడియాతో మాట్లాడారు. ఇది చాలా చరిత్రాత్మక దినం. 30 ఏళ్ల కల నెరవేరబోతోంది. కొత్త ఆసుపత్రి రోగులకు ఒక భరోసా ఇస్తుంది. అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా జెరియాట్రిక్, పాలియేటివ్, ట్రాన్స్‌ప్యూజన్, అడ్మినిస్ట్రేటివ్, రుమటాలజీ, ఫిజియోథెరఫీ, అత్యవసర మెడిసిన్, జెనెటిక్స్ విభాగాలు రానున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా,చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాలుగు వైపులా విశాలమైన రహదారులు నిర్మించనున్నాం. దీంతో ఇక్కడ వ్యాపార, ఇతర కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఆసుపత్రి పక్కనే ఉన్న పోలీస్ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ (Helipad) నిర్మించి అత్యవసర పరిస్థితిలో రోగులను ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు వాడుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో కొత్త భవనం పూర్తి చేయనున్నాం. తెలంగాణలో తొలిసారి ఎక్కువ మంది వైద్యులు శాసనసభ్యులుగా గెలిచారు. వారి కూడా కొత్త భవనం కావాలని కోరుకుంటున్నారు అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు హాజరయ్యారు.