CM Revanth: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma House Scheme) యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి (Revanth) మాట్లాడుతూ రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం. ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు. రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు రూ.5లక్షలకు చేరుకుంది. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది మా లక్ష్యం. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చాం అని తెలిపారు.