KTR–Lokesh–Revanth: రేవంత్ ఆరోపణలతో ఇరకాటంలో లోకేష్ – కేటీఆర్..!?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రహస్యంగా సమావేశమయ్యారని రేవంత్ ఆరోపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలు నిజమా, కేవలం రాజకీయ కుట్రలో భాగమా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ ఆరోపణలు టీడీపీ (TDP) , బీఆర్ఎస్‌లకు ఎలాంటి సమస్యలు తీసుకొస్తాయోననే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేటీఆర్, లోకేష్‌ను అర్ధరాత్రి రహస్యంగా కలిశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్, టీడీపీ మధ్య రాజకీయ ఒప్పందాలపై అనుమానాలను రేకెత్తించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సామ రామ్మోహన్ రెడ్డి గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. రేవంత్ మాటలను బలపరిచేలా, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా ఈ భేటీ గురించి ప్రస్తావించాయి. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు.
అయితే కేటీఆర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. “మేము కలవలేదు, కలిసినా దానిలో తప్పేముంది?” అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ సమావేశం జరిగినట్లయితే, దాని ఉద్దేశ్యంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, లోకేష్ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఇది మరింత అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ శత్రుత్వం గతంలో స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో, ఈ ఆరోపణలు రెండు పార్టీలకూ ఇబ్బందికరంగా మారాయి.
తెలంగాణలో టీడీపీ రాజకీయ బలం సన్నగిల్లినప్పటికీ, జూబ్లీహిల్స్ (Jubilee Hills Assembly) వంటి కీలక నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ టీడీపీ మద్దతు కోరుతుందనే ఆరోపణలు రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఈ ఆరోపణల ద్వారా బీఆర్ఎస్‌ను రక్షణాత్మకంగా మార్చి, తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ ఆరోపణలు టీడీపీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలో ఉంది. బీఆర్ఎస్‌తో రహస్య ఒప్పందాల ఆరోపణలు ఈ కూటమిలో అనుమానాలను రేకెత్తించే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డి తన ఆరోపణలను బలపరిచేలా ఆధారాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఇవి కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేటీఆర్, లోకేష్ తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు ఈ ఆరోపణలు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీ ఇప్పటికే రాజకీయంగా బలహీనమైన స్థితిలో ఉంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి, కేసీఆర్ ఆరోగ్య సమస్యలు, కవిత వేరుకుంపట్లు బీఆర్ఎస్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో, టీడీపీతో రహస్య ఒప్పందాల ఆరోపణలు బీఆర్ఎస్ ఇమేజ్‌కు మరింత గండి కొట్టవచ్చు.
మరోవైపు, టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. లోకేష్ రాజకీయంగా బిజీగా ఉన్న సమయంలో ఈ ఆరోపణలు ఆ పార్టీకి కూడా ఇబ్బందిగా మారవచ్చు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు బీఆర్ఎస్‌కు లభిస్తే, అది తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చవచ్చని రేవంత్ ఆరోపణలు సూచిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలు నిరూపితం కాకపోతే, రేవంత్ విశ్వసనీయత ప్రశ్నార్థకం కావచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. కానీ స్వయంగా ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ చర్చకు దారితీశాయి.