Revanth Reddy : బనకచర్లపై కేంద్రానికి మా అభ్యంతరం చెప్పాం : రేవంత్ రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil ) తో భేటీ అయిన సీఎం పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మంత్రి ఉత్తమ్ (Minister Uttam) తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కార్ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, అలా తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల (Banakacharla)పై తమ అభ్యంతరం తెలపగా, తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. తెలంగాణలో గోదావరి(Godavari)పై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదు. మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్‌లో గోదావరి విషయంలో వస్తాయి. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని సీఎం తెలిపారు.