Bhatti Vikramarka: తెలంగాణలో మరోసారి కులగణన: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో మరొకసారి కులగణన చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణలో ఈ సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. ఇదివరకు చేసిన సర్వేలో పాల్గొనని ప్రజల కోసమే ఈ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 3.1 శాతం మంది ఇదివరకు జరిపిన సర్వేలో పాలుపంచుకోలేదని, ఈ క్రమంలోనే వారిని కూడా జనాభా లెక్కల్లోకి తీసుకురావడం కోసం ఈ సర్వే చేస్తున్నామని ఆయన (Deputy CM Bhatti Vikramarka) వివరించారు. కొన్నిరోజుల క్రితం, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేతో పాటు కులగణన కూడా చేయగా.. ఈ నివేదికను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రవేశపెట్టారు.