ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని ఆయన చెప్పారు. దసరా రోజు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి శమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆచారమని అందరికీ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్న ఆయన.. అలాయ్ బలాయ్ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా ప్రజల నడుమ సామాజిక సామరస్యం పరిఢవిల్లుతుందని కొనియాడారు.