Bhatti : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. తెలంగాణలో : భట్టి విక్రమార్క

తెలంగాణను దేశంలోనే సుసంపన్నంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం (Khammam)లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భట్టి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణపై దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు ఉండేలా చేశామని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. B. R. Ambedkar) మాటలను స్పూర్తిగా తీసుకుని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను తీసుకొచ్చాం. కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తున్నాం. మధిర నియోజకవర్గం (Madhira Constituency) బోనకల్ మండలాన్ని రెండో పైలట్ మండలంగా తీసుకున్నాం. రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు ప్రతి గ్రామానికి పరిపాలనాధికారిని నియమిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం అన్నారు.
ఆడబిడ్డల ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యత్ అందిస్తున్నాం. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma’s house ) ఇస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానవవికి 3,500 ఇళ్లను కేటాయించాం. ప్రస్తుత యాసంగికి బోనస్ చెల్లించనున్నాం. బాలిక పుట్టడం అదృష్టంగా భావించాలని మా పాప మా ఇంటి మణీదీపం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం. ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు రానున్నాయి. రింగ్ రోడ్డుకు చర్యలు చేపట్టాం. మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణం చేపడుతున్నాం అని తెలిపారు.