Bhatti Vikramarka: బీఆర్ఎస్కు మేలు జరిగేలా బీజేపీ : భట్టి విక్రమార్క
 
                                    ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ను గెలిపించాలనే కుట్రలో భాగంగా హైదరాబాద్ బిడ్డ అజారుద్దీన్ (Azharuddin) ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా అడ్డుకోవాలని బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారుడు అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవదని ఈసీకీ బీజేపీ నాయకత్వం లేఖ రాయడం తగదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఈ లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలనే తాపత్రయంతోనే బీఆర్ఎస్ ఓట్లన్నీ వేయిస్తే 8 సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. జూబ్లీహిల్స్‌లో ఎన్నికలో తానెటూ గెలవదని అత్యంత బలహీనమైన అభ్యర్థిని, బాగా ఆలస్యంగా బీజేపీ ప్రకటించింది. అజారుద్దీన్‌తో ప్రమాణస్వీకారం చేయించకుండా గవర్నర్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తోంది. గవర్నర్ ఆ ఒత్తిళ్లకు లొంగరు. కానీ బీజేపీ చాలా వరకు ఆ ప్రయత్నాలు చేస్తోంది. వారికి మేలు జరుగుతుంటే ఒకలా, అవతలివారికి నష్టం చేయాలనుకుంటే మరోలా బీజేపీ కార్యకలాపాలు నిర్వహించడాన్ని అందరూ గమనిస్తున్నారు. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మైనార్టీలంతా కాంగ్రెస్‌కు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ నేతలు ఈ కుట్ర చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం జరిగే రాజ్‌భవన్ ప్రాంతంలో ఎన్నికల నియమావళి అమల్లో లేదు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత గతంలో చెప్పారు. ఆ పరిస్థితులు నిజమే అనేలా ఈ రోజు బీఆర్ఎస్కు మేలు జరిగేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు.











 
                                                     
                                                        