Bandi Sanjay: తెలంగాణలో మూడు ఎమ్లెల్సీ స్థానాలు బీజేపీకే: బండి సంజయ్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరేయడం ఖాయమని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలను గెలిపించడానికి పూర్తి కమిట్ మెంట్‌తో పనిచేసే క్యాడర్ కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఆయన (Bandi Sanjay) అన్నారు. ఢిల్లీ ఫలితాల స్ఫూర్తితో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించిన ఆయన. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. రకరకాల స్కాంలలో ఉన్న బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చెయ్యడం లేదని ఆయన (Bandi Sanjay) నిలదీశారు. కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ అంతర్గతంగా పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలను ప్రజల ముందు ఎండగట్టాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను బట్టబయలు చెయ్యాలని బీజేపీ వర్కర్లకు ఆయన సూచించారు. తెలంగాణలో బీజేపీ విజయం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.