Alleti Maheshwar Reddy: త్వరలోనే తెలంగాణ సీఎం మారతారు: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి
తెలంగాణలో త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) జోస్యం చెప్పారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతున్నారని, రాహుల్ భజన, మోడీ దూషణ చేస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అందులో 10 శాతం ముస్లింలకేనని ఆయన (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. ముస్లింల వాటాను తీసివేస్తే బీసీలకు మిగిలేది 32 శాతమేనని అన్నారు. కులాల వారీగా జనాభా వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్ అగ్రనాయకులు రాకపోవడం ఆయన భవిష్యత్తుపై స్పష్టత ఇస్తోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. చాలా కాలంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా దీనికి నిదర్శనమని చెప్పారు. జనాభా ప్రకారం బీసీలకు కనీసం ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, కాంగ్రెస్ కేవలం ముగ్గురికే ఇచ్చిందని, ఇంకా ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను బీసీలకే ఇవ్వాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.







