Addanki Dayakar: రాహుల్ గురించి మాట్లాడే స్థాయి లేదు.. బీజేపీ నేతపై అద్దంకి దయాకర్ ఫైర్

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఒక వీడియో విడుదల చేస్తూ, రఘునందన్ రావు బీఆర్ఎస్ సహకారంతో ఎంపీగా గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో ఒప్పందం చేసుకుని మెదక్ ఎంపీ అయ్యావని విమర్శించారు. రాహుల్ గాంధీకి, రఘునందన్ రావుకు (Raghu Nandan Rao) నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అద్దంకి దయాకర్ అన్నారు. పెద్ద వాళ్లపై మాట్లాడితే పెద్దవాడివి అవుతానని రఘునందన్ రావు అనుకుంటున్నారని, అయితే బీజేపీలోనే ఆయనకు బేస్ లేదని దయాకర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము రఘునందన్ రావుకు లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌పై ప్రశ్నలు వేస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలోని చిత్ర విచిత్రాలను రాహుల్ గాంధీ బయటపెడుతున్నారని, ఈసీ వాటికి సమాధానం చెప్పలేకపోతోందని విమర్శించారు. బండారం బయటపడుతుందనే భయంతో బీజేపీ నాయకులున్నారని, వారి కథను రాహుల్ గాంధీ ముగిస్తారని అద్దంకి దయాకర్ (Addanki Dayakar) హెచ్చరించారు.