Surya Namaskar : శత సహస్ర సూర్య నమస్కారాల్లో .. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు

సమాజానికి ఆరోగ్య సందేశాన్ని ఇస్తూ వ్యాస మహర్షి యోగా సొసైటీ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్ధిపేట(Siddipet) జిల్లా కేంద్రంలో నిర్వహించిన శత సహస్ర సూర్య నమస్కారాల (Surya Namaskar) ప్రదర్శన లక్ష్యాన్ని దాటి ఔరా అనిపించింది. ప్రభుత్వ బాలికల విద్యా సముదాయ ప్రాంగణం వేదికగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 1,484 మంది యోగా సాధకులు తరలివచ్చారు. ఏడు ఆసనాలు, 12 భంగిమలతో సమ్మిళితమై ఉండే సూర్య నమస్కారాలను వయోభేదం లేకుండా ఉత్సాహంగా ప్రదర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రదర్శనలు సాగగా, సాయంత్రం వరకు పోటీలు జరిగాయి. మొత్తం 4,02,154 సూర్య నమస్కారాలతో అబ్బురపర్చారు. రాష్ట్ర యోగ అధ్యయన పరిషత్ సభ్యుడు, శిక్షకుడు తోట సతీశ్ (Satish) నేతృత్వంలో ఏకకాలంలో అత్యధిక సూర్య నమస్కారాలతో సాగిన ఈ ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్(Wonder Book of Records) ( ఇంటర్నేషనల్)లో స్థానం పొందింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి జ్యోతి, నిర్వాహకులు డా. అరవింద్, తోట అశోక్, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy), విక్రంరెడ్డిలకు ధ్రువపత్రం, పతకం ప్రదానం చేసి అభినందించారు.