YCP: విపక్షంగా వైసీపీ పునరుద్ధరణ యత్నం: కోటి సంతకాల కార్యక్రమంలో నిజాయితీ ఎంత?
వైసీపీ గత ఏడన్నర సంవత్సరంగా శక్తివంతమైన విపక్షంగా పనిచేయడంలో లోపించిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పార్టీ నాయకుల స్పందన తగ్గిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, వైసీపీ ఒక పెద్ద ప్రజా కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని లక్ష్యంగా చేసుకుని, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్దమయ్యారు. ప్రజల మద్దతును చూపించేందుకు కోటి సంతకాల (Koti Santakala) సేకరణ అనే విస్తృత ప్రోగ్రాంను రూపొందించారు.
ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేట్ చేతుల్లోకి ఇస్తోంది, దీని వల్ల పేద కుటుంబాలకు వైద్య విద్య అందకుండా పోతుందని వైసీపీ వాదిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, అదే సమయంలో పార్టీ కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయడం లక్ష్యంగా ఈ ప్రణాళిక వేసుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో వేల సంఖ్యలో సంతకాలు సేకరించి వాటిని చివరకు గవర్నర్‌కు (Governor) అందించాలని నిర్ణయించారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి దాదాపు కోటి సంతకాలు సేకరించడం ఒక పెద్ద లక్ష్యం.
అయితే ఈ కార్యక్రమం ఎంతవరకు నిజంగా ప్రజలను ఆకర్షించగలిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంక్షేమ పథకాలే ముఖ్యం అనుకునే ప్రజలు, ఈ రకమైన సంతకాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంత ఆసక్తి చూపలేదని వైసీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ సిక్స్ (Super six) వంటి పథకాలు కొనసాగాలి అంటే వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే ప్రజలలోని భావం అని అంటున్నారు. దీంతో ప్రజల నేరుగా పాల్గొనడంకన్నా పార్టీ కేడర్ మీదే భారంగా మారినట్లు కనిపిస్తుంది.
ఇంకా మరోవైపు, వైసీపీ ఇంచార్జిల పరిస్థితి కూడా పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పాలి. 2024 ఎన్నికల సమయంలో అడుగడుగునా నియోజకవర్గాలు మార్చడంతో, చాలామంది కొత్త ప్రాంతాల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వీరిలో పలువురు తిరిగి తమ పాత స్థానాల్లోనే రాజకీయంగా సజీవంగా ఉండాలని చూస్తున్నారు. అందుకే వారు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా పనిచేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకమాండ్ ఎన్నిసార్లు ఆదేశించినా, ఈ కార్యక్రమంలో చాలా మంది నేతలు కేవలం పేరుమాత్రానికే పాల్గొన్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇక సంతకాల సేకరణలోనూ కొంత గందరగోళం కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలను ఆధారంగా చేసుకొని పార్టీ కేడర్‌నే భారీ సంఖ్యలో సంతకాలు చేయించినట్టు ఆరోపణలు రావడం, కొన్ని నియోజకవర్గాల్లో 90 శాతం వరకు ఫేక్ సంతకాలున్నాయనే ప్రచారం రావడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. అసలు ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం ఎంతుందన్న అనుమానం కూడా పెరిగింది. మొత్తం మీద వైసీపీ ఎంతో ప్రచారంతో ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం వెనుక చాలా అంతర్గత సమస్యలు బయటపడుతున్నాయి. ఈ కార్యక్రమం పార్టీకి మైలురాయిగా మారుతుందా, లేక ఆంతర్యాల్లోని బలహీనతలను మరింత స్పష్టంగా చూపిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.






