Minister Anita: గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దు :మంత్రి అనిత
మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Anita) అన్నారు. దీనికోసం ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు విశాఖపట్నం (Visakhapatnam) రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీ (Bicycle rally) ని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వద్దు- జీవితమే ముద్దు అంటూ నినదించారు. అనంతరం విద్యార్థులతో మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ యువత భవిష్యత్ చాలా ముఖ్యమని, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. ఎన్డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్‌శాఖ ఎంతో కృషి చేస్తోంది. ప్రస్తుతం నిఘా పెరిగింది. కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయి. గంజాయి రవాణా చేసినా, దాన్ని తీసుకుంటున్నా వెంటనే 1972 నంబర్ కాల్ చేయండి. వెంటనే పోలీసులు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అని అన్నారు.







