Visakhapatnam: ఏపీ రాజకీయాలకు హాట్ స్పాట్ గా మారుతున్న విశాఖ..
విశాఖపట్నం (Visakhapatnam) ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ప్రధాన వేదికగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే ఈ నగరానికి ప్రత్యేకమైన స్థాయి ఏర్పడింది. మెగా సిటీగా ఉండడంతో పాటు, అధికార కార్యక్రమాలైనా , పార్టీ మీటింగ్సులైనా నిర్వహించుకోవడానికి విశాఖ కంటే మంచిది లేదనే అభిప్రాయం అందరిలో ఉంది. “సిటీ ఆఫ్ డెస్టినీ” (City of Destiny) అని పిలుచుకునే ఈ నగరం చుట్టూనే ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీ స్థాయిలో భారీ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న మీటింగ్స్ కావడంతో దీనికి ప్రత్యేక హంగు ఏర్పడింది. మూడు రోజుల పాటు పవన్ విశాఖలోనే ఉండటం పార్టీ కార్యకర్తలకే కాకుండా అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. సాగర తీరంలోని ఈ నగరంలో జనసేన నాయకులు రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకోవడంతో రాజకీయ రచ్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ బస ఇక్కడే ఉండటం వల్ల సాధారణ ప్రజల దృష్టీ కూడా విశాఖ వైపు మరింతగా మళ్లింది.
ఇక మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కూడా అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 29న విశాఖకు రానున్నారు. ఆయన సుమారు అయిదు నుండి ఆరు గంటలపాటు ఈ నగరంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన పూర్తిగా అధికారికంగానే ఉన్నా, ఒక రోజు పాటు సిఎం విశాఖలో ఉండటం పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉండటం వలన కూటమి ప్రభుత్వమే విశాఖలో కేంద్రీకృతమైందని భావిస్తున్నారు.
ఇక కూటమిలో మరో కీలక నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కూడా మూడు రోజులపాటు విశాఖ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. ఆయన అనేక అధికారిక మరియు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా విశాఖలోని తెలుగు దేశం పార్టీ (TDP) ఆఫీసులోనే రాత్రి బస చేస్తారని సమాచారం. ఈ సందర్బంగా స్థానిక నేతలతో సమావేశమై, పార్టీ పనితీరు మరియు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించనున్నారు.
మొత్తంగా చూస్తే, ఒకే సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురూ విశాఖలో ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశేషంగా మారింది. సముద్రతీర నగరం రాజకీయ రాజధాని వలె మారిపోతోందని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పరిణామం కూటమి ప్రభుత్వం ప్రాముఖ్యతను మరింతగా ఎత్తిచూపుతోందని, ఇకపై విశాఖపట్నం రాజకీయ కేంద్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







