Vikshanam: వైభవంగా వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 13వ వార్షికోత్సవ సమావేశం- పద్మజ చెంగల్వల

వీక్షణం (Vikshanam) సాహితీ గవాక్షం 13వ వార్షికోత్సవ సమావేశం సెప్టెంబర్ 13,2025 న కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ (Fremont) లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా శ్రీమతి ఎల్.విజయలక్ష్మి (అలనాటి మేటి నటీమణి), శ్రీ సురజిత్ కుమార్ దే దత్తా, డా. కాత్యాయనీ విద్మహే, శ్రీ జి. వల్లీశ్వర్, శ్రీమతి కె.వరలక్ష్మి గార్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వీక్షణం ప్రత్యేక రచనా సంకలనం, వీక్షణం 13 సంవత్సరాల సమావేశాల ప్రత్యేక సంచికల ఆవిష్కరణ ప్రఖ్యాత టాక్ షో వ్యాఖ్యాత, కౌముది సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతికిరణ్, వీక్షణం అధ్యక్షులు డా.కె.గీతామాధవి గార్ల చేతుల మీదుగా జరిగింది. కవిసమ్మేళనాన్ని శ్రీ రావు తల్లాప్రగడ గారు నిర్వహించారు.
ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి గారు సభకు ఆహ్వానం పలుకుతూ వీక్షణం ప్రారంభమైన తొలిరోజు నించీ విశేషాంశాల్ని తలుచుకున్నారు. 2012 సెప్టెంబర్ లో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో వీక్షణం సాహితీ వేదిక అతి సాధారణంగా ప్రారంభమైనా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సమావేశాలు జరుపుకుంటూ ఉంది. శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు వీక్షణం భారతదేశ ప్రతినిధిగా సేవలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా గీత గారు వీక్షణానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.
సభకు ఆతిథ్యం వహించిన శ్రీ సుభాష్ పెద్దు గారు, డా. వందన గార్లు ఈనాటి ముఖ్య అతిథులైన శ్రీమతి ఎల్.విజయలక్ష్మి (అలనాటి మేటి నటీమణి), శ్రీ సురజిత్ కుమార్ దే దత్తా, డా. కాత్యాయనీ విద్మహే, శ్రీ జి. వల్లీశ్వర్, శ్రీమతి కె.వరలక్ష్మి గార్లను వేదికకు ఆహ్వానించారు.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, శ్రీమతి ఎల్.విజయలక్ష్మిగారి సహచరులు శ్రీ సురజిత్ కుమార్ దే దత్తా గారు, శ్రీమతి ఎల్.విజయలక్ష్మి గార్లు మాట్లాడుతూ తమ జీవితానుభవాల్ని పంచుకున్నారు. సురజిత్ కుమార్ దే దత్తా గారు హరితవిప్లవంలో ప్రముఖపాత్ర వహించారు. సురజిత్ కుమార్ దే దత్తా గారు అత్యంత సాధారణ జీవితాన్నించి అమెరికాలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన క్రమాన్ని, ఎల్. విజయలక్ష్మి గారు అత్యంత ప్రముఖ జీవితాన్నించి కుటుంబ జీవితానికి పరిమితమైనా, అలవోకగా జీవితాన్ని ఎన్నో కళలకు, విద్యలను నేర్చుకోవడానికి అంకితం చేసిన విధానం అందరినీ అబ్బురపరించింది.
డా.కాత్యాయనీ విద్మహే గారు ప్రముఖ కథకురాలైన శ్రీమతి కె.వరలక్ష్మి గారి కథల్లోని విశిష్టాంశాల్ని, గ్రామీణ బహుజన జీవితాల్ని ఆవిష్కరించిన విధానాన్ని ‘మంత్రసాని’, ‘స్వస్తి’ మొదలైన కథలను విశ్లేషిస్తూ వివరించారు.
ప్రముఖ పాత్రికేయులు శ్రీ జి. వల్లీశ్వర్ గారు తమ పాత్రికేయానుభవాల్ని హాస్యస్ఫోరకంగా వివరిస్తూ ప్రసంగించారు. శ్రీ కిరణ్ ప్రభ గారు అలనాటి ప్రముఖ నటీమణి, గాయని టంగుటూరి సూర్య కుమారి గారి గురించి ప్రసంగించి సభను అలరించారు.
చివరగా శ్రీ రావు తల్లాప్రగడ గారు కవిసమ్మేళనాన్ని తన గజల్ తో శుభారంభం చేశారు. తరువాత డా.కె.గీతామాధవి గారు తమ కవిత ద్వారా వీక్షణం సుక్షణాల్ని పంచుకోగా, కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి గారు పద్య కవితని, వంశీ ప్రఖ్యా గారు కృత్రిమ మేధని గురించిన వచన కవితని, యువకవి శశి ఇంగువ అనువాద పాటని, గాయనీమణి శ్రీమతి గాయత్రి అవ్వారి గారు అద్భుత గానాన్ని వినిపించారు. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్య అతిథి శ్రీమతి ఎల్.విజయలక్ష్మి గారు కూడా తమ అద్భుత గానాన్ని వినిపించడం విశేషం.
అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కవులు, రచయితలు, ప్రముఖులు, సాహిత్యాభిలాషులు శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీమతి పద్మజ చెంగల్వల, శ్రీమతి నీరజ కందాళ, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీ సుబ్బారావు గునుపూడి, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి సుచేత, శ్రీ ప్రసాద్ నల్లమోతు, వేమూరి వేంటేశ్వర్రావు, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీ బండ్ల కోటేశ్వరరావు, శ్రీ సుబ్బారావు తల్లాప్రగడ, శ్రీ పెద్దు గోపీచంద్, శ్రీ మూర్తి అవ్వారి, శ్రీ ఇంగువ మల్లికార్జున శర్మ, శ్రీమతి ఇంగువ బాలామణి, శ్రీ రావు కాకర్లమూడి మొదలైన వారు విశేష సంఖ్యలో హాజరయ్యారు.