Minister Srinivas: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఇటీవల దావోస్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నామని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. విజయనగరంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బ్రాండ్ ఇమేజ్‌తో తిరిగి రప్పిస్తున్నామని తెలిపారు. జర్మనీ (Germany) లోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన సదస్సులోనూ సత్ఫలితాలు వచ్చాయన్నారు. ఏరోస్పేస్, రక్షణ, ఈవీ మాన్యుఫాక్చరింగ్ రంగాల అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సహకాలను వివరించామన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వ్యాపారవేత్తల్లో భరోసా నింపిందని వివరించారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నం (Visakhapatnam) లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్దంగా ఉన్నాయని, ఇవన్నీ కార్యరూపం దాల్చి సత్ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందన్నారు.