Chandrababu: రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా మారనున్న సీఐఐ సదస్సు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే మరో కీలక ఘట్టంగా విశాఖపట్నం (Visakhapatnam) లో జరగబోయే సీఐఐ (CII) సదస్సు నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) తన రాజకీయ ప్రయాణంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ సదస్సు రాష్ట్ర పెట్టుబడుల చరిత్రలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆయన ఇప్పటికే అనేక దేశాల్లో పర్యటించి, వందలాది పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించారు. పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, సాంకేతిక దిశలో ఆయనకున్న విశాల అనుభవంతో పలువురు అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి అంగీకరించాయి.
ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు జరగబోయే ఈ సదస్సులో ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక దిశలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తో పాటు పలు మంత్రులు మరియు అధికారుల బృందం 30 కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులను కలిశారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సులభ అనుమతి విధానాలను వారికి వివరించారు. ఫలితంగా, సుమారు 300 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారని సమాచారం.
మొత్తం 45 దేశాల నుంచి 72 మంది అంతర్జాతీయ ప్రసంగకర్తలు, 12 పెద్ద మల్టీ నేషనల్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారం, సదస్సులో 410కి పైగా అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోబోతున్నారు. వీటి ద్వారా సుమారు ₹9.8 లక్షల కోట్ల పెట్టుబడులు 7.5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల ఫలితంగా 16 నెలల్లోనే ₹10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రాగా, ఇప్పుడు సీఐఐ సదస్సుతో మరో ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది.
“జాబ్ ఫస్ట్” అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టింది. దీని ఫలితంగా దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రంపై విశ్వాసం పెంచుకుంటున్నారు. ఇప్పటికే గూగుల్ (Google) డేటా సెంటర్, రామాయపట్నం (Ramaayapatnam) లో బీపీసీఎల్ (BPCL) రిఫైనరీ, ఆర్సెల్లార్ మిట్టల్ (Arcelor Mittal) స్టీల్ ప్లాంట్ వంటి పెద్ద పరిశ్రమలు ఏపీలో ఏర్పాటవుతున్నాయి.
అదనంగా టీసీఎస్ (TCS) కొత్త సర్వీస్ సెంటర్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తిరుపతిలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics) ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా సాగుతోంది. అమరావతిలో (Amaravati) మైక్రోసాఫ్ట్ (Microsoft) క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఒకే దిశలో సాగుతుండటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందనే సంకేతంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సీఐఐ సదస్సు విజయవంతమైతే ఏపీ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల కేంద్రంగా గుర్తింపు పొందే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







