Vice President: పెట్టుబడుల సాధనలో చంద్రబాబు కృషి శ్లాఘనీయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ భాగస్వామ్యంతో విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన భాగస్వామ్యసదస్సులో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (CP Radha Krishnan) పాల్గొన్నారు. ఆయన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. దేశంలో పేదరికం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కార్మిక చట్టాలు, పన్నుల్లో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మోదీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకెళ్తోంది. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది. మూడు దశాబ్దాలుగా సీఎం చంద్రబాబు నాకు స్నేహితుడు. ఆయన సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయి. లక్ష్యం పెట్టుకోవడం సులువు.. అక్కడికి చేరుకోవడం కష్టం. పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయి’’ అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోందని తెలిపారు. అభివృద్ధికి – సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని అంటూ, పెట్టుబడులను రాబట్టడంలో చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకనామి ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.
ఇ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయన్నారు. టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోనూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ ఉపరాష్ట్రపతి అందరికీ పిలుపునిచ్చారు. వచ్చే రెండు మూడేళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టంగానూ భారత్ ఎదుగుతుందని పేర్కొన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. ప్రతీ దేశంతోనూ భారత్ మైత్రినే కోరుకుంటుందని.. అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారతదేశానిది అని అన్నారు. ఇతరులకు నష్టం కలిగించటం కాదు, ప్రయోజనం కల్పించటం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదమని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.






