ఇకపై.. శాశ్వతంగా సేంద్రియ పంటలతోనే శ్రీవారికి నైవేద్యం : సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

ఇకపై శాశ్వతంగా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతోనే శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఈ సంప్రదాయం అమలులో ఉందని, అయితే ఇకపై పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘గోవిందునికి గోఆధారిత నైవేద్యం’ అన్న కార్యక్రమం కింద సహజంగా గోఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో శాశ్వతంగా నైవేద్యం సమర్పించాలని నిర్ణయిచామని పేర్కొన్నారు. హిందూధర్మ ప్రచార పరిషత్ సాయంతో అన్ని జిల్లాల రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చూస్తామని, వారికి గిట్టుబాటు ధర కూడా వచ్చేలా చూస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని ప్రకటించారు.
ఇప్పటికే తాము కశ్మీర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామని, 18 నెలల్లోనే స్వామి వారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే మరో 500 శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. ఎస్వీబీసీ ఛానళ్లను ఇకపై కనడ, హిందీ భాషల్లో కూడా ప్రసారాన్ని అతి త్వరలోనే చేపడతామని ప్రకటించారు. అంతేకాకుండా టీటీడీ అధీనంలో ఉన్న ప్రతి ఆలయానికీ ‘గుడికో గోమాత’ పథకాన్ని విస్తరిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో టీటీడీ కల్యాణ మంటపాలను కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇకపై తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్రకటిస్తున్నామని, భవిష్యత్తులో తిరుమలలో పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే నడుస్తాయని అన్నారు. టీటీడీ పరిధిలోని అన్ని విభాగాల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఈ మేరకు ఓ నూతన విధానాన్ని కూడా తీసుకొస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.