Chandrababu: అధికారంలోనే పార్టీ బలపరచడం.. చంద్రబాబు వేస్తున్న ముందస్తు చెస్మూవ్స్..
తెలుగుదేశం పార్టీ (TDP) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలపర్చడంపై అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ బాధ్యతలు ఎంత పెద్దవైనా, పార్టీ కార్యకలాపాలకు ఆదివారాలు, శనివారాలు పూర్తిగా కేటాయిస్తూ ఆయన కొత్త శైలిలో ముందుకు సాగుతున్నారు. ఎక్కడ ఉన్నా పార్టీ శ్రేణులకు సమయం ఇవ్వాలనే నిర్ణయంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను ఆయనే నేరుగా తెలుసుకుంటూ ఉండడం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను చూసేందుకు పెద్దగా అవకాశం లేకపోయినా, కాలం మారిందని, రాజకీయాలు వేగంగా మారుతున్నాయని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా పార్టీబలపరచడంపైనే దృష్టి పెట్టారు. నాయకులకు అప్పగించిన బాధ్యతలు సరిగ్గా అమలవుతున్నాయా? టాస్కులను ఎంతవరకు పూర్తి చేస్తున్నారు? ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో? వంటి విషయాలన్నింటినీ పరిశీలిస్తూ పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
రాబోయే ఎన్నికలకు ఇంకా మూడేండ్లు సమయం ఉన్నప్పటికీ, ముందుగానే పార్టీని గెలుపు దిశగా నడిపించాలన్న పెద్ద లక్ష్యంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వైసీపీ (YCP) తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా, గ్రౌండ్ లెవెల్లోనే టీడీపీని బలపరచడమే ఆయన వ్యూహం. గ్రౌండ్ లెవెల్ నుంచి సీనియర్ నాయకుల వరకు అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ఆయనే నేరుగా జోక్యం చేసుకోవడం కూడా ఇప్పుడు నాయకత్వంలో కొత్త మార్పుగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కేవలం అభివృద్ధి, సంక్షేమంతోనే కాకుండా, బలమైన సామాజిక వర్గాల సమీకరణలపైనే ఆధారపడి ఉంటాయి. ఇలాంటి రాష్ట్రంలో ముందుగానే పార్టీని సక్రమంగా సంస్కరించడం, శ్రేణుల్లో నమ్మకం పెంచడం, ప్రతి నియోజకవర్గంలో నాయకత్వాన్ని మళ్లీ చురుకుగా మార్చడం చాలా కీలకం. ఈ కోణంలో చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు రాబోయే ఎన్నికల కోసం టీడీపీని శక్తివంతమైన స్థితిలో నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.
ఇంకోవైపు ఇదంతా జరుగుతుండగా, వైసీపీ పరిస్థితి రాజకీయ విశ్లేషకుల్లో చర్చగా మారింది. ప్రత్యర్థి పార్టీ ఇంత వేగంగా పునర్వ్యవస్థీకరణలో పడుతుండగా వైసీపీ కూడా ఇప్పుడు నుంచే మార్పులు తీసుకువస్తుందా? లేక మరికొంత కాలం వేచి చూస్తుందా? అనేది స్పష్టత కావాల్సిన అంశంగా మారింది. ప్రజా మద్దతు కోల్పోయిన నేపథ్యంలో వైసీపీ ఇప్పటికిప్పుడు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నప్పటికీ, పార్టీ లోపల ఏ విధమైన సంస్కరణలు వస్తాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు చేసే ఈ మార్పులు టీడీపీని మరోసారి శక్తివంతమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నమే. ఈ చర్యలు భవిష్యత్ రాజకీయ సమీకరణలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.






