Piyush Goyal: గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖపట్నం…పీయూష్ గోయల్
విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పాల్గొని ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదని.. యావత్ భారతదేశం అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తారని ప్రశంసించారు. గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖపట్నం నిలుస్తోందని ఉద్ఘాటించారు. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అభివర్ణించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతోందని వివరించారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడేనని… వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదేనని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని పేర్కొన్నారు. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నామని వివరించారు. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. 30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు పీయూష్ గోయల్.
104 శాటిలైట్లను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన దేశంగా సాంకేతికతను ప్రజలకు దగ్గర చేస్తున్నామని నొక్కిచెప్పారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నామని వివరించారు. ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఉన్న భారత యువత ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. వసుదైక కుటుంబం అనే భారతీయ భావనను కోవిడ్ సమయంలో 110 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి నిరూపించామని ఉద్ఘాటించారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని వివరించారు పీయూష్ గోయల్. డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ దిశగా, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ ఆర్ధిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్దఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉందని వివరించారు. అత్యంత పారదర్శకమైన విధానంలో వాణిజ్యం ఉండాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని అన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢల్లీిలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.






