Peddireddy Ramachandra Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి పరామర్శ తర్వాత చంద్రబాబు పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు ఆయనకు వచ్చే నెల మొదటి తారీఖు వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఇతర వైసీపీ నేతలతో కలిసి జైలుకు వెళ్లారు.
అక్కడి నుంచి బయటికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీ (TDP) పాలనలోనే పెద్ద ఎత్తున మద్యం అవినీతి జరిగిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం దానికి మించి వ్యవస్థను మద్యం పరంగా కుంభకోణాలకు అడ్డాగా మార్చిందని ఆరోపించారు.
ఇక మద్యం నియంత్రణ విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేట్ వారికి అప్పగించిందని గుర్తు చేస్తూ, గత వైసీపీ హయాంలో అయితే ప్రైవేట్ మద్యం షాపులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని నియంత్రణకు కృషి చేశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రభుత్వ కాలంలో ఏ ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఆదాయం గణనీయంగా పెరిగినా, అమ్మకాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. వైసీపీ పాలనలో చివరి ఏడాది మద్యం ఆదాయం రూ. 25 వేల కోట్లుగా ఉన్నప్పటికీ, వినియోగం తగ్గిందని వివరించారు. దానికి భిన్నంగా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రజలపై మద్యం భారాన్ని పెంచి, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొన్ని చోట్ల బెల్ట్ షాపులు తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయని, కొన్ని గ్రామాల్లో మద్యం డోర్ డెలివరీ వరకూ సాగిపోతోందని మండిపడ్డారు. చివరగా తనపై పెట్టే అబద్ధపు కేసులకు భయపడబోమని, ప్రజల కోసమే తాము పని చేస్తున్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతాపం చూపించాలనుకునే చంద్రబాబు ధోరణి పట్ల ప్రజలు త్వరలోనే తీర్పు చెబతారని పేర్కొన్నారు.