Pawan Kalyan: వ్యక్తిత్వ హక్కుల రక్షణలో పవన్ కళ్యాణ్ న్యాయపోరాటం..డిసెంబర్ 22కి విచారణ వాయిదా..
ఆన్లైన్ ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ సోషల్ మీడియా (Social Media) ప్రభావం ఊహించని స్థాయికి చేరుకుంది. ఇప్పుడు దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కూడా తోడవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. నిజం–అబద్ధం మధ్య గీత చెరిగిపోగా, ప్రస్తుత కాలంలో ప్రముఖులు తమ వ్యక్తిత్వ పరిరక్షణ కోసమే న్యాయస్థానాల సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వరుసలో తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా చేరడం పెద్ద చర్చకు దారితీసింది.
పవన్ కళ్యాణ్ తరపున ఆయన న్యాయవాది ఢిల్లీలోని హైకోర్టులో (Delhi High Court) పిటీషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా పనిచేస్తున్నారని, నకిలీ పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, అసత్య వ్యాఖ్యల ద్వారా తన ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నారని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన హైకోర్టు తీవ్రంగా స్పందించి, వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పవన్ తరఫుకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే గూగుల్ (Google), మెటా (Meta), ఎక్స్ (X) సంస్థలు చర్యలు తీసుకునేలా కోర్టు ఆదేశించడాన్ని విశేషంగా భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ (Power Star) ఇమేజ్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనపై దాడులు మరింత పెరిగాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని కొందరు వ్యక్తులు, ఆర్గనైజ్డ్ గ్రూపులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ శిబిరం ఆరోపిస్తోంది. ఇటీవల ఎఐ సాయంతో రూపొందించిన నకిలీ వీడియోలు, శబ్ద మార్పులు చేసిన క్లిప్‌లు, తప్పుడు ట్వీట్లు విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఇవన్నీ కలిసి చివరకు కోర్టు ఆశ్రయించాల్సిన పరిస్థితికి దారి తీసినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు పడినది పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు. ఇటీవల ప్రభాస్ (Prabhas)–అనుష్క (Anushka) వివాహం జరిగినట్టుగా రూపొందించిన ఎఐ వీడియో పెద్ద కలకలం రేపింది. ఇదే విధంగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కూడా సెప్టెంబర్ నెలలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారని ఆయన అప్పట్లో కోర్టులో ఫిర్యాదు చేశారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఇదే తరహా సమస్యలను ఎదుర్కొని గతంలో న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సివచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు విస్తరించిన ఈ యుగంలో వ్యక్తిగత హక్కులు, గౌరవ పరిరక్షణ ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ కేసు మరోసారి స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న దుర్వినియోగాలను కోర్టు ఎంతవరకు నియంత్రించగలదన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. డిసెంబర్ 22న జరిగే తదుపరి విచారణ ఈ వివాదంపై భవిష్యత్ దిశను నిర్ణయించనున్నట్లు కనిపిస్తోంది.
.






