Nellore Mayor: టీడీపీకి షాక్ ఇచ్చిన వైసీపీ..! నెల్లూరులో కాక..!!
నెల్లూరు నగర పాలక సంస్థ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా ఉంటుందని భావించిన సింహపురి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మేయర్ పొట్లూరి స్రవంతిపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం.. ఆ వెంటనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా-నేనా అనే స్థాయికి చేరాయి. డిసెంబర్ 18న అవిశ్వాస పరీక్ష జరగనుండగా, ఇటు టీడీపీ, అటు వైసీపీ కార్పొరేటర్లను క్యాంపులకు తరలిస్తూ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. మొత్తం 54 డివిజన్లలో (ఒకటి ఎన్నిక ఆగింది) 53 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పట్లో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా భయభ్రాంతులకు గురిచేసి, ఏకగ్రీవాలు చేసుకున్నారని టీడీపీ ఆరోపించింది. అలా మేయర్ పీఠం వైసీపీ వశమైంది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి రావడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. అధికారం మారడంతో నెల్లూరు కార్పొరేటర్ల విధేయతలు కూడా మారాయి. దాదాపు 40 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం టీడీపీకి నల్లేరు మీద నడకలా కనిపించింది. సంఖ్యాబలం ఉంది కాబట్టి, మేయర్ స్రవంతిని గద్దె దించేందుకు డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారు చేశారు.
అవిశ్వాసం గెలవడం ఖాయమని టీడీపీ ధీమాగా ఉన్న తరుణంలో, వైసీపీ అనూహ్యమైన స్ట్రోక్ ఇచ్చింది. టీడీపీలో చేరిన వారిలో ఐదుగురు కార్పొరేటర్లు (విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, బారా నిస్సార్ అహ్మద్, ఓర్సు ఆశ్వేరమ్మ, మన్నూరు పెంచల నాయుడు) అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వారు తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాము భయపడి టీడీపీలోకి వెళ్లామని, కానీ మా మనసు వైసీపీలోనే ఉందంటూ వారు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఈ పరిణామం టీడీపీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. చేతిలో ఉన్నట్టే ఉన్న మేయర్ పీఠం చేజారిపోతుందేమోనన్న ఆందోళన కూటమి వర్గాల్లో మొదలైంది.
ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైసీపీ గూటికి చేరడంతో టీడీపీ అప్రమత్తమైంది. మిగిలిన వారు కూడా చేజారిపోకుండా ఉండేందుకు వెంటనే క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. తమ మద్దతుదారులైన కార్పొరేటర్లను ప్రత్యేక బస్సుల్లో గోవాకు తరలించింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, ఫోన్లకు దూరంగా ఉంచి వారిని కాపాడుకునే పనిలో పడింది. మరోవైపు వైసీపీ కూడా తమ వాళ్లను కాపాడుకునేందుకు రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. అవిశ్వాస పరీక్ష రోజు వరకు ఎవరూ ఎవరినీ ప్రలోభపెట్టకుండా ఉండేందుకు రెండు పార్టీలు ఈ క్యాంప్ రాజకీయాలను నమ్ముకున్నాయి.
ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్లో నెగ్గాలంటే సంఖ్యాబలం కీలకం. అవిశ్వాసం నెగ్గాలంటే టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ అవసరం. 53 మంది కార్పొరేటర్లలో ఇప్పుడు టీడీపీ వైపు ఉన్నవారి సంఖ్య 35కు పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఎక్స్-అఫీషియో ఓట్లు కలుపుకుంటే తమకు ఢోకా లేదని టీడీపీ భావిస్తోంది. కానీ, వైసీపీ వాదన మరోలా ఉంది. మరో పది మంది కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని, చివరి నిమిషంలో వారు కూడా ట్విస్ట్ ఇస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అవిశ్వాసం వీగిపోతే అది అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. నెగ్గితే వైసీపీకి పట్టు తప్పినట్లవుతుంది.
ఇది కేవలం ఒక మేయర్ సీటు గొడవ కాదు. నెల్లూరు జిల్లాలో పట్టు నిలుపుకోవడం రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికారంలో ఉండి కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే మంత్రి నారాయణ సహా ముఖ్య నేతలు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు వైసీపీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం కోల్పోయిన తర్వాత డీలా పడ్డ క్యాడర్లో జోష్ నింపాలంటే ఇక్కడ గెలిచి తీరాలి. జగన్ స్వయంగా రంగంలోకి దిగి కార్పొరేటర్లను చేర్చుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదే.
మొత్తానికి డిసెంబర్ 18న నెల్లూరు కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఏం జరగబోతోందనేది సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. మరి గోవా క్యాంప్ నుంచి వచ్చే కార్పొరేటర్లు టీడీపీకి జై కొడతారా? లేక వైసీపీ వ్యూహంలో చిక్కుకుంటారా? అనేది వేచి చూడాలి.






