Nara Lokesh: ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్టు రావడంపై లోకేశ్ హర్షం
ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ (Semiconductor) ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తంచేశారు. “డబుల్ ఇంజిన్ సర్కార్” నాయకత్వంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏపీకి రావడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ (APACT) కంపెనీ లిమిటెడ్‌తో కలిసి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ (ASIP) టెక్నాలజీ కింద ఏపీలో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు, ఆటోమొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం సెమీకండక్టర్లు తయారవుతాయి. ఇది ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి ఎంతో దోహదపడుతుందని లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటి మొత్తం వ్యయం రూ.4,594 కోట్లు అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టులతో దేశంలో సెమీకండక్టర్ (Semiconductor) యూనిట్ల సంఖ్య పదికి చేరుకుంది.







